Tuesday, February 15, 2011

మేధస్సుకు పదును "మన లైబ్రరి" - పిల్లల్లో పుస్తక పఠనాసక్తి పెంపుదలకి దోహదం

మిత్రులారా,
పెరుగుతున్న ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, ఆకర్షణీయమైన ఆడంబర కార్యక్రమాలు పిల్లల్ని సహజసిద్ధమైన ఆసక్తులకు దూరం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో జహీరాబాద్ లో స్ధాపించిన "మన లైబ్రరి" స్కూల్ పిల్లల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందిచడానికి ఎంతోకొంత దోహదం చేస్తుండటం సంతోషకరమైన విషయం. పల్లె పల్లెకు - వాడవాడకూ ఇటువంటి మనలైబ్రరి లు వెల్లువలా ఉదయించాలని ఆశిస్తున్నాము.

Friday, February 4, 2011

చిట్టిచేతులు రాసిన చక్కనికధలు

"జహీరాబాద్ పిల్లల కధలు" పుస్తకావిష్కరణ సభ

 స్కూల్  పిల్లలకు దాదాపు రోజంతా  పాఠాలు ,హోమ్ వర్క్ , ఏతావాతా సమయం దొరికితే టి.వి. లాంటి మాధ్యమాలు తప్పితే  మిగతా మానసిక వికాసం లేకుండా పోతున్న పరిస్ధితి మనం చూస్తున్నాం. బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని పెంచే ఏ రకమైన అంశం కూడా పిల్లలకు అందుబాటులో లేకుండా పోయేటంత  పోటీప్రపంచం దీన్ని మరింత జఠిలం చేస్తున్నది. ఈ నేపధ్యంలో ప్రపంచాన్ని వీక్షించడానికి అద్భుతసాధనమైన పుస్తకపఠనాన్ని ప్రోత్సహించాలని తలపెట్టింది "మనలైబ్రరి , జహీరాబాద్". కధారచన కూడా పుస్తకపఠనాన్ని ప్రేరేపించే బలమైన సాధనం.  కధలు వ్రాయాలంటే  మహారచయితలే కానక్కర్లేదు. స్కూల్ లో చదివే పిల్లల్నే రచయితలు/రచయిత్రులుగా ప్రోత్సహించి కధారచన పోటీలు నిర్వహించాము. దాదాపు 30 స్కూల్స్ నుండి 150మంది కధలు వ్రాశారు. అందులో 30కధల్ని ఎంచుకుని "జహీరాబాద్ పిల్లల కధలు" అన్న పేరిట పుస్తకం ప్రచురించాము. ఈ పుస్తకావిష్కరణ ది.3-2-11(గురువారం)నాడు జరిగింది. పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా  ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు శ్రీ.చుక్కారామయ్య విచ్చేసి సభికుల్ని ఉత్తేజపర్చేలా ప్రసంగించారు.  300మందికి పైగా విద్యార్ధినీ విద్యార్ధులు, 100మందికి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,మేధావులు హాజరైన ఈ సభ పుస్తకపఠనం, కధారచన వంటి అంశాలపై ఆసక్తిని రేకెత్తించడంలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు.
జనవిజ్ఞానవేదిక  మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వీలైనంతగా ఇటువంటి  కార్యక్రమాలు  చేపడితే భావి తరాలకు ఒక మంచి ఒరవడిని అందించిన వారమౌతామని భావిస్తున్నాను.

    స్వేచ్ఛ-విజ్ఞానాభివందనాలతో,
                                                                                                               డా.శివబాబు,జహీరాబాద్





                                              


Wednesday, January 12, 2011

జహీరాబాద్ లో జనవిజ్ఞానవేదిక కార్యక్రమాలు

మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణం పరిసరాల గ్రామాల్లో బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలు నేటికీ ప్రబలంగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం కల్గివున్న హైటెక్ సిటి హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వున్న మెదక్ జిల్లాలో ఇప్పటికీ పలు గ్రామాల్లో వివిధ సందర్భాల్లో బాణామతి,చేతబడి పేరిట అనుమానిత వ్యక్తులపై దాడులు, హత్యలు వంటి సంఘటనలు జరగడం శోచనీయం.అలాగే ప్రజలలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాధమిక అంశాల్లో కూడా పలురకాల మూఢనమ్మకాలు నెలకొనివున్నాయి. ఈ నేపధ్యంలో జహీరాబాద్  జనవిజ్ఞానవేదిక యూనిట్   2005నుండి ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా ధోరణిని పెంపొందిచేందుకు పలు కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నది. ముఖ్యంగా విద్య,వైద్యం,పర్యావరణం, సంస్కృతి వంటి రంగాలకు సంబంధించి విద్యార్ధినీ విద్యార్ధులు, యువతీయువకులు, ప్రజలలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది.ఈ కృషిలో భాగంగా ఈ బ్లాగ్ ద్వారా  జహీరాబాద్ జనవిజ్ఞానవేదిక యూనిట్ చేస్తున్న కృషిని మరింత విస్తృతం చేసేందుకు, మిగతా సమాజంలోని శాస్త్రీయ ఆలోచనాపరులనుండి తగిన సూచనలు స్వీకరించే ఈ కృషిని మరింత బలోపేతం చేసేందుకు తలపెట్టడమైనది. ఈ బ్లాగ్ లో జహీరాబాద్ లో జనవిజ్ఞానవేదిక 2005నుండి చేసిన కార్యక్రమాలను క్రమంగా పొందుపర్చగలము. 
ధన్యవాదాలతో,
డా.కె.శివబాబు,
ప్రగతినర్సింగ్ హోమ్,
జహీరాబాద్
కన్వీనర్, ఆరోగ్య సబ్ కమిటి, జనవిజ్ఞానవేదిక, మెదక్ జిల్లా.