Wednesday, January 12, 2011

జహీరాబాద్ లో జనవిజ్ఞానవేదిక కార్యక్రమాలు

మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణం పరిసరాల గ్రామాల్లో బాణామతి, చేతబడి వంటి మూఢనమ్మకాలు నేటికీ ప్రబలంగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం కల్గివున్న హైటెక్ సిటి హైదరాబాద్ కు కూతవేటు దూరంలో వున్న మెదక్ జిల్లాలో ఇప్పటికీ పలు గ్రామాల్లో వివిధ సందర్భాల్లో బాణామతి,చేతబడి పేరిట అనుమానిత వ్యక్తులపై దాడులు, హత్యలు వంటి సంఘటనలు జరగడం శోచనీయం.అలాగే ప్రజలలో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రాధమిక అంశాల్లో కూడా పలురకాల మూఢనమ్మకాలు నెలకొనివున్నాయి. ఈ నేపధ్యంలో జహీరాబాద్  జనవిజ్ఞానవేదిక యూనిట్   2005నుండి ప్రజలలో శాస్త్రీయ ఆలోచనా ధోరణిని పెంపొందిచేందుకు పలు కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నది. ముఖ్యంగా విద్య,వైద్యం,పర్యావరణం, సంస్కృతి వంటి రంగాలకు సంబంధించి విద్యార్ధినీ విద్యార్ధులు, యువతీయువకులు, ప్రజలలో శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది.ఈ కృషిలో భాగంగా ఈ బ్లాగ్ ద్వారా  జహీరాబాద్ జనవిజ్ఞానవేదిక యూనిట్ చేస్తున్న కృషిని మరింత విస్తృతం చేసేందుకు, మిగతా సమాజంలోని శాస్త్రీయ ఆలోచనాపరులనుండి తగిన సూచనలు స్వీకరించే ఈ కృషిని మరింత బలోపేతం చేసేందుకు తలపెట్టడమైనది. ఈ బ్లాగ్ లో జహీరాబాద్ లో జనవిజ్ఞానవేదిక 2005నుండి చేసిన కార్యక్రమాలను క్రమంగా పొందుపర్చగలము. 
ధన్యవాదాలతో,
డా.కె.శివబాబు,
ప్రగతినర్సింగ్ హోమ్,
జహీరాబాద్
కన్వీనర్, ఆరోగ్య సబ్ కమిటి, జనవిజ్ఞానవేదిక, మెదక్ జిల్లా.